ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ వాస్తవానికి గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై ప్రోటీన్, ఆల్ నేచురల్, ఆర్గానిక్ వంటి ఆకర్షణీయమైన లేబుల్స్ చూసి చాలామంది వాటిని ఎలాంటి సందేహం లేకుండా కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిలో దాగి ఉన్న అధిక చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్డ్ పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచే ప్రమాదం ఉందని మాయో క్లినిక్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కైలా లారా-బ్రెయిటింగర్ వెల్లడించారు. రోజువారీ ఆహారపు అలవాట్లే భవిష్యత్తులో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతాయని ఆమె సూచించారు.
డాక్టర్ కైలా వివరించిన మొదటి ఆహారం రెడీ-టు-డ్రింక్ ప్రోటీన్ షేక్స్. ప్రస్తుతం ఫిట్నెస్ పేరుతో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే చాలా కమర్షియల్ ప్రోటీన్ షేక్స్‌లో ఒక చాక్లెట్ బార్ లేదా సాఫ్ట్‌డ్రింక్‌లో ఉండేంత చక్కెర ఉంటుంది. షుగర్ ఫ్రీ అని రాసి ఉన్నా, అందులో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, మరింత ఆకలి పెరిగేలా చేసి అధికంగా తినే అలవాటుకు దారితీస్తాయి. వీటి బదులుగా సోయాబీన్స్, శనగలు, పప్పులు, గింజలు వంటి సహజ ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
రెండోది మార్కెట్లో లభించే స్టోర్-బాట్ గ్రానోలా. గ్రానోలాను చాలామంది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తారు. కానీ రుచి కోసం తయారీ సంస్థలు ఇందులో అధిక మొత్తంలో చక్కెర, సిరప్, అన్‌హెల్తీ ఫ్యాట్స్ కలుపుతుంటాయి. ప్రాసెసింగ్ కారణంగా సహజ ఫైబర్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా ఇది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలకు దోహదం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్యాకెట్‌పై ఉన్న న్యూట్రిషన్ లేబుల్‌ను తప్పనిసరిగా చదవాలని, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఓట్స్, నట్స్, గింజలు, తేనెతో గ్రానోలా తయారు చేసుకోవడం లేదా తాజా పండ్లు, మిక్స్డ్ నట్స్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మూడోది కొబ్బరి నూనె. వీగన్, ఆర్గానిక్ అనే పేర్లతో దీనిని ఆరోగ్యకరమైన ఎంపికగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇందులో శ్యాచురేటెడ్ ఫ్యాట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్ కైలా తెలిపారు. అధిక పరిమాణంలో కొబ్బరి నూనెను తరచుగా వాడటం వల్ల రక్తంలో LDL కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. వెన్న లేదా కొన్ని జంతు కొవ్వులతో పోలిస్తే కూడా ఇందులో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి వంటకంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం కంటే పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవడం, అవసరానికి అనుగుణంగా ఇతర ఆరోగ్యకరమైన నూనెలను వినియోగించడం మంచిదని సూచించారు.
ఆరోగ్యంపై ప్రభావం చూపేది ఒక్కోసారి పెద్ద ఆహార మార్పులు కాదు, ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న ఆహార నిర్ణయాలేనని వైద్యులు చెబుతున్నారు. మార్కెటింగ్ ప్రకటనలు లేదా ఆకర్షణీయమైన లేబుల్స్‌ను నమ్మకుండా, ఆహార పదార్థాల్లోని పోషక విలువలను పరిశీలించి ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం, తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ఫైబర్, పండ్లు, కూరగాయలు, తగిన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news