అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం అయోధ్య పర్యటన చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించిన పార్టీ, ఇప్పుడు రామభక్తి గురించి మాట్లాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రస్తుతం అసత్యాలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు రాంపూర్‌లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో "జై శ్రీరామ్" నినాదాలు చేసిన వారిపై లాఠీచార్జీలు, కాల్పులు జరిపించిన వారే ఇప్పుడు రామభక్తి గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 2017కు ముందు శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని కూడా విశ్వసించని కాంగ్రెస్ ఇప్పుడు అయోధ్యకు వెళ్లాలని ఆసక్తి చూపుతోందని అన్నారు. అయోధ్య, కాశీ విశ్వనాథ్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని, అందుకే అసత్య ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నాయని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రతినిధి బృందం అయోధ్య పర్యటనకు ముందు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రామాలయ విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం రామలల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే తమ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ, తమ పార్టీ ప్రతినిధి బృందాన్ని అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భగవంతుడు శ్రీరాముడి దర్శనం చేసుకోవడం కూడా ఇప్పుడు నేరమైందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు దేవాలయాలను సందర్శించే హక్కును కూడా ప్రభుత్వం అడ్డుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news