సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాల్చుతున్న నేపథ్యంలో జపాన్ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ మోసాలు, పెట్టుబడి మోసాలు, నకిలీ పోలీసు కాల్స్, ప్రేమ పేరుతో జరిగే మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు "ఏఐకో" అనే కృత్రిమ మేధస్సు ఆధారిత వర్చువల్ పోలీస్ చీఫ్‌ను రంగంలోకి దింపింది. ఒసాకా ప్రిఫెక్చురల్ పోలీస్ రూపొందించిన ఈ డిజిటల్ పోలీస్ అధికారి ప్రస్తుతం యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ సైబర్ మోసాలను ఎలా గుర్తించాలో వివరిస్తోంది.
"ఏఐకో" అనే పేరు కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో "ఏఐ" అంటే కృత్రిమ మేధస్సు, "కో" అనేది జపనీస్ మహిళల పేర్లలో సాధారణంగా ఉపయోగించే ప్రత్యయం. యువతి రూపంలో రూపొందించిన ఈ వర్చువల్ పోలీస్ అధికారి స్నేహపూర్వక శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, వీడియో కాల్స్, మెసేజింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలపై జాగ్రత్తలు సూచిస్తోంది
జపాన్‌లో గత ఏడాది సైబర్ మోసాల కారణంగా బాధితులు రెండు బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా నష్టపోయినట్లు అధికారిక అంచనాలు వెల్లడించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి మోసాలు, నకిలీ ప్రేమ సంబంధాల పేరుతో డబ్బు దోచుకోవడం, పోలీసు అధికారుల పేరుతో బెదిరించి నగదు వసూలు చేయడం వంటి నేరాలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ అవగాహన కార్యక్రమాల కంటే యువతను ఎక్కువగా చేరుకునే డిజిటల్ ప్రచారం అవసరమని భావించి ఏఐకోను రూపొందించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news