గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా ఈ కొత్త విధానాన్ని కేంద్రం ప్రవేశపెడుతోంది. కొత్త చట్టం కింద అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 100 రోజుల బదులుగా 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధ హామీ లభించనుంది. పథకం అమలుకు అవసరమైన పరిపాలనా, సాంకేతిక, ఆర్థిక ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్త పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ.95,692.31 కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీంతో పనులు నిరంతరాయంగా కొనసాగడంతో పాటు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించగలమని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోరే ప్రతి అర్హుడికి పని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ కొత్త విధానంలో గ్రామ పంచాయతీల పాత్ర మరింత కీలకంగా ఉండనుంది. గ్రామ స్థాయిలో పనుల ఎంపిక, అమలు, పర్యవేక్షణలో పంచాయతీలకు ప్రధాన బాధ్యతలు అప్పగించనున్నారు. నీటి సంరక్షణ, సహజ వనరుల అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారతకు దోహదపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఈ-కేవైసీ పూర్తి చేసిన జాబ్ కార్డులు కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది.
దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు పూర్తి చేశాయని, 24 రాష్ట్రాలు తమ రాష్ట్ర స్థాయి పథకాల నోటిఫికేషన్లు కూడా జారీ చేశాయని కేంద్రం వెల్లడించింది. దీంతో కొత్త వ్యవస్థ అమలుకు దేశవ్యాప్తంగా సన్నాహాలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ పథకం అమలుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎంజీనరేగాను ముగించి కొత్త పేరుతో పథకాన్ని తీసుకొస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాలకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పథకంలో మొత్తం వ్యయంలో 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నారని కూడా విమర్శించారు.
ఖరీఫ్ వ్యవసాయ సీజన్లో అమలు చేయనున్న కొన్ని నిబంధనల వల్ల గ్రామీణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. రోజువారీ కూలీని రూ.400కు పెంచాలని మరోసారి డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కొత్త చట్టం గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెంచి గ్రామీణ ఆస్తుల సృష్టికి కూడా దోహదపడుతుందని స్పష్టం చేసింది.
ఈ పథకానికి సంబంధించిన జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జులై 2న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేయడంతో పాటు పథకంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. గ్రామీణాభివృద్ధి రంగంలో ఈ కొత్త పథకం కీలక మార్పులకు నాంది పలుకుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news