కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇసుకపాళెంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు వెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన “పేదల సేవలో” కార్యక్రమం ద్వారా గ్రామాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నామని చెప్పారు.
ఇసుకపాళెం గ్రామంలో అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలకు “తల్లికి వందనం” పథకం మంజూరైందని, అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందుతున్నాయని తెలిపారు. గ్రామంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు సకాలంలో అందుతున్నాయని చెప్పారు.
గ్రామ అభివృద్ధి పనులపై కూడా ఆమె వివరాలు వెల్లడించారు. పంచాయతీరాజ్ నిధులతో రూ.53 లక్షల వ్యయంతో 10 సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రూ.36 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టామని, విద్యుత్ శాఖ ద్వారా రూ.30 లక్షల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. జలవనరుల శాఖ ద్వారా రూ.35 లక్షల పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.10 లక్షల సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇసుకపాళెంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆమె చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అలాగే ఓటరు జాబితా పరిశీలన (SIR) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయించాలని, ఓటు హక్కు ఉంటేనే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందగలరని ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news