సర్వేపల్లి నియోజకవర్గంలో పీ4 కార్యక్రమం అమలు, సీఎస్ఆర్ నిధుల వినియోగంలో సాధించిన పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అభినందించారు. ఉండవల్లిలో జరిగిన మర్యాదపూర్వక భేటీలో సర్వేపల్లిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం ప్రశంసలు కురిపించారు. "చాలా బాగా చేశావ్ చంద్రమోహన్.. పీ4లో సర్వేపల్లి సూపర్" అంటూ సోమిరెడ్డి పనితీరును అభినందించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో పీ4 కార్యక్రమం కింద చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ను ముఖ్యమంత్రికి అందజేశారు. సీఎస్ఆర్ నిధులను ప్రభుత్వ పీ4 కార్యక్రమంతో అనుసంధానం చేసి నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.
పీ4లో భాగంగా ఇప్పటివరకు 1,841 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు సోమిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో సోలార్ వీధి దీపాల ఏర్పాటు, స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ల నిర్మాణం, గిరిజన కాలనీల దత్తత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్నాయని సీఎం అభినందించారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వేలాది మంది గిరిజనులకు ఆధార్ కార్డులు అందేలా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరేలా చేస్తున్న కృషిని కొనియాడారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2,000 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, అదనంగా వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, సోలార్ వీధి దీపాల విస్తరణ, కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల స్థాపన, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దడం, ఆసుపత్రి నిర్మాణం, ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీల దత్తత వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సోమిరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ జెన్కో, ఎస్ఈఐఎల్ థర్మల్ పవర్ ప్లాంట్, అదానీ కృష్ణపట్నం పోర్టు, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, పామాయిల్ పరిశ్రమలు తదితర అనేక పారిశ్రామిక సంస్థలు ఉన్నాయని, వాటి కోసం భూములు ఇచ్చిన ప్రజలు కాలుష్య ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. అందువల్ల ఆయా సంస్థల సీఎస్ఆర్ నిధుల్లో అధిక భాగం స్థానిక ప్రజల సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలనే ప్రతిపాదనను కంపెనీల ముందుంచినట్లు తెలిపారు.
ఈ ప్రతిపాదనకు కంపెనీలు సానుకూలంగా స్పందించడంతో తొలి ఏడాదిలోనే రూ.52 కోట్లకు పైగా సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం మరో రూ.34 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నిధులతో గ్రామీణ మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పనులు కొనసాగనున్నట్లు తెలిపారు.
వ్యక్తిగతంగా కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం అవుతున్న సోమిరెడ్డి గతంలో మల్లికార్జునపురం గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ప్రస్తుతం ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని వారి విద్యా బాధ్యతలను స్వీకరించినట్లు వివరించారు. పీ4 కార్యక్రమం ద్వారా మరిన్ని కుటుంబాలకు అండగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నందగోకులం, స్వర్ణభారత్ ట్రస్టు వంటి సంస్థల సహకారంతో విద్య, వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మొత్తంగా పీ4 కార్యక్రమాన్ని సీఎస్ఆర్ నిధులతో అనుసంధానం చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని వేగవంతం చేసే ఈ నమూనా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news