అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాక్ నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఎంటీ సన్మార్ హెరాల్డ్ అనే చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకుంది. ప్రయాణ సమయంలో హోర్ముజ్ ప్రాంతంలో జరిగిన దాడుల ప్రభావంతో నౌక స్వల్ప నష్టం చవిచూసినప్పటికీ, ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా గమ్యస్థానానికి చేరడం ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఖతార్ రాజధాని దోహాలో కొత్త చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. అయితే ఇరాన్ అధికారులు అలాంటి సాంకేతిక చర్చలు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు దోహాకు వెళ్లనున్నట్లు శ్వేతసౌధం ధృవీకరించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఇరాన్ ప్రజల విజయంగా అభివర్ణించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో కీలక భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ట్యాంకర్ సురక్షితంగా భారత తీరానికి చేరుకోవడం ఇంధన భద్రత పరంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news