గ్రామీణ కూలీల జీవనోపాధికి మరింత భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ‘వీబీ గ్రామ్జీ’గా మార్చినట్లు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. రంపచోడవరం మండలం చిన్నగెద్దాడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తదితరులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ పేరుతో రూపొందించిన ఈ కొత్త చట్టం ద్వారా ఉపాధి కూలీలకు గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో సంవత్సరానికి 100 రోజుల ఉపాధి మాత్రమే కల్పించగా, ఇప్పుడు 125 రోజుల వరకు పనిదినాలు పెంచినట్లు వెల్లడించారు. అలాగే రోజువారీ కూలి రూ.307 నుంచి రూ.312కు పెరిగిందని చెప్పారు.
ఈ పథకంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి నాలుగు ప్రధాన విభాగాల కింద మొత్తం 318 రకాల పనులకు అనుమతి కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయ పనులకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళికతో రైతులకు సహకరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల పట్టాదారులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ 150 రోజుల వరకు ఉపాధి అవకాశాలు అందించనున్నట్లు శిరీషాదేవి తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పారదర్శకంగా అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.
వీబీ గ్రామ్జీ పథకం కింద రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా పండ్ల తోటలు, వ్యవసాయ షెడ్లు, నీటి వనరుల అభివృద్ధి వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాలల ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదులు, ఆరోగ్య కేంద్రాలు, గ్రావెల్ రహదారులు వంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టే అవకాశం ఉందని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, ఉపాధి కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, భారీ సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, రైతు సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన వీబీ గ్రామ్జీ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తమైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news