దేశ పశ్చిమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ఉద్ధృతంగా మారడంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై, థానే, పాల్ఘర్, రాయగడ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, గుజరాత్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాల కారణంగా తీవ్ర జలమయం పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోవడం, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. వచ్చే రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
ముంబైలో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దాదర్, అంధేరి, పరేల్, హింద్మాతా, సియోన్, వర్లీ, గోరేగావ్, కుర్లా వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించగా, అనేక చోట్ల వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముంబై సబర్బన్ రైల్వే సేవలు కొన్ని మార్గాల్లో ఆలస్యంగా నడవగా, విమాన సర్వీసులపైనా ప్రభావం కనిపించింది. భారీ అలల హెచ్చరికల కారణంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
ఐఎండీ జారీ చేసిన రెడ్ అలర్ట్ ప్రకారం, ముంబై మహానగర ప్రాంతంలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది
Fetching videos...
Fetching latest news...
No trending news