సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణల వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ద్వారా "వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ష నినాదంతో ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ (SBA) కొరియన్ టెక్ స్టార్టప్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ టీఐహెచ్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతీయ శాఖలతో పనిచేస్తోందన్నారు. టాటా, ఎల్&టీ, జీఎంఆర్, గ్రీన్కో, అదానీ, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో దీనిని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆర్ టీఐహెచ్ ఫుల్ లైఫ్ సైకిల్ ప్రోగ్రామ్స్ అయిన స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), క్యాటలిస్ట్ (18 వారాల ఇంక్యుబేషన్), వెలాసిటీ ల్యాబ్ లలోకి కొరియన్ స్టార్టప్‌లను ఆహ్వానం పలుకుతున్నామన్నారు.
ఈ వేదిక ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్‌లకు మద్దతునిచ్చింది, 5,200కు పైగా ఎంటర్ ప్రెన్యూర్ లను భాగస్వాములను చేసింది. ఏపీ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ 2024–29లో భాగంగా ప్రోటోటైపింగ్, డీప్-టెక్ గ్రాంట్ల కింద ₹22 కోట్ల RTIH–SIDBI సీడ్ ఫండ్, ₹20 కోట్ల వరకు AIF సీడ్ ఈక్విటీ, క్రెడిట్-గ్యారెంటీ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాం. 160కి పైగా VC/ఏంజెల్ సిండికేషన్ నెట్వర్క్ కలిగిన ఆర్ టీఐహెచ్ ఇప్పుడు ఏఐ, క్వాంటం, అధునాతన తయారీ కోసం SIDBI భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన డీప్-టెక్ ఏంజెల్ ఫండ్‌తో ఇప్పుడు మరింతగా విస్తరించినట్లు తెలిపారు. స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కలిసి పనిచేద్దాం ఆర్టీఐహెచ్ను కేంద్రంగా చేసుకుని ఇండియా-కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటు కోసం కలిసి పనిచేద్దామని కొరియన్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం.
ఒక ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్-ల్యాండింగ్ "విసి బే", కొరియన్ ఏజెన్సీలతో (కోట్రా/కె-స్టార్టప్) సహ-ఇంక్యుబేషన్ ఏర్పాటుచేస్తాం. దీనిద్వారా రెండువైపులా మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. కొరియన్ స్టార్టప్‌లు భారతదేశంలోని టైర్ 2–3 మార్కెట్లలోకి, ఆంధ్రప్రదేశ్ స్టార్టప్‌లు కొరియాలోకి రావడం సులభతరమవుతుంది. భారతదేశ ఆక్వాకల్చర్‌లో ఆంధ్రప్రదేశ్ సుమారు 40% వాటాను కలిగి ఉంది, 1,053 కిలోమీటర్ల సుదూర తీరప్రాంతం వెంబడి లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, డీప్-టెక్, ఫ్రాంటియర్ టెక్, అధునాతన తయారీ హబ్ లలో పెట్టుబడులు కొరియన్ సంస్థలకు లాభసాటి కాగలవని మంత్రి లోకేష్ చెప్పారు. అమరావతిలో తొలి క్వాంటం-ఏఐ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ ఏఐ రాజధానిగా నిలపడం మాధ్యేయం. ఇందులో భాగంగా గూగుల్ ఏఐ హబ్ (ఏప్రిల్ 2026లో శంకుస్థాపన చేశాం.
రిలయన్స్, సిఫీ, కంట్రోల్ఎస్ తదితర సంస్థలు ఏపీలో 10 గిగావాట్ల డేటా-సెంటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా స్టార్టప్‌లకు సరసమైన ధరలకు పెద్ద ఎత్తున కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం & AI విశ్వవిద్యాలయం అమరావతి క్వాంటం వ్యాలీలో ఆవిష్కృతమవుతోంది. దీనిద్వారా భారతదేశపు అత్యంత అధునాతన 133-క్యూబిట్ IBM క్వాంటం సిస్టమ్ టూల్, IBM–TCS క్వాంటం క్లౌడ్ సర్వీసెస్, ఒక క్వాంటం హార్డ్‌వేర్ పార్క్ అందుబాటులోకి రానున్నాయి. కొరియన్ డీప్-టెక్ స్టార్టప్‌ల పరిశోధన, సహ-అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news