చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నరామాపురం, కందులవారిపల్లి పంచాయతీల్లో ఏనుగుల దాడుల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే పులివర్తి నాని, అటవీశాఖ డీఎఫ్‌వో వి. సాయిబాబా కలిసి నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 39 మంది రైతులకు రూ.8,48,650 విలువైన పరిహారాన్ని అందజేస్తూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గించే దిశగా శాశ్వత చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా గతంలో ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువ నాయకుడు రాకేష్ చౌదరికి ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులు, రైతులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అడవుల్లోనే ఏనుగులకు తగిన ఆహారం, నీరు లభించేలా వాగులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్‌వో వి. సాయిబాబా వెల్లడించారు. ఏనుగుల సంచారంపై రైతులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, శాఖ అధికారులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. రైతుల భద్రతతో పాటు పంటలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. శేషాపురం నుంచి మూలపల్లి వరకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.52 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. అలాగే అటవీ ప్రాంతాల సమీపంలో పూడిపోయిన ట్రెంచ్‌లను తన సొంత నిధులతో పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా సమగ్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని, రైతుల పంటలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. రైతులు అధైర్యపడకుండా తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ప్రతి నష్టాన్ని సానుకూలంగా పరిశీలించి తక్షణ సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news