రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను కీలక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ, భౌగోళిక, పారిశ్రామిక వనరులను సమర్థంగా వినియోగిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకతను గుర్తించి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా అభివృద్ధి చేసి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లకు సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రెండు నెలల్లో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రణాళికలను రూపొందించే ముందు ప్రజలు, ప్రజాప్రతినిధులు, నిపుణుల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా తుది రూపం ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో 'వైజాగ్ బే సిటీ'ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఇది భవిష్యత్తులో పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, ఐటీ మరియు సేవారంగాల విస్తరణకు కీలక కేంద్రంగా మారేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
అంతేకాకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల నిర్వహణకు అనువైన వేదికలను సృష్టించాలని పేర్కొన్నారు. మూడు ఎకనామిక్ రీజియన్లలో చేపట్టే ప్రాజెక్టుల పురోగతిని ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, నిర్ణయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ ఎకనామిక్ రీజియన్లు కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని సీఎం స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news