నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలంలోని కోటపాడు గ్రామ మండల పరిషత్ పాఠశాల ప్రాంగణంలో దానధర్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విద్యారంభాన్ని శుభప్రదంగా భావిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఆచారాల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజారి ప్రసాద్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో తొలి అక్షరాలు దిద్దించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు. సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యాభ్యాసంలో చిన్నారులు రాణించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదాలు అందించారు.
దానధర్మా చారిటబుల్ ట్రస్ట్, వేద సంకల్ప ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 40 మంది చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేసి అక్షరాభ్యాసం నిర్వహించినట్లు ట్రస్ట్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. విద్యను ప్రతి చిన్నారి జీవితానికి బలమైన పునాదిగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా తల్లిదండ్రుల్లో విద్యాపట్ల మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులందరికీ స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూజారి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ప్రతి చిన్నారి విద్యలో ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యతోనే వ్యక్తిత్వ వికాసం, కుటుంబాభివృద్ధి, సమాజ పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బాల నాగమణి, ఉపాధ్యాయులు సలోమీ, మల్లికాబాయి, శంకర్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యా ప్రాధాన్యతను చాటి చెప్పే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలని పలువురు అభిప్రాయపడ్డారు.
Fetching videos...
Fetching latest news...
No trending news