ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాలకు పైగా తన ఆటతో అలరించిన దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచకప్ మ్యాచ్‌ను ఓటమితో ముగించాడు. రౌండ్ ఆఫ్ 16లో స్పెయిన్‌తో జరిగిన కీలక పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు స్పెయిన్ ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డోకు 2026 ప్రపంచకప్ ప్రత్యేకమైనది. ఇదే తన చివరి ప్రపంచకప్ అని ఆయన ఇప్పటికే ప్రకటించాడు. 2006లో తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన రొనాల్డో.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ వేదికపై పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే చివరి టోర్నీలో మాత్రం తన జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలన్న అతని కల నెరవేరలేదు.
స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ గట్టిగా పోరాడినప్పటికీ, చివరి వరకు గోల్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత సమయం ముగిసే వరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి. అయితే అదనపు సమయంలో స్పెయిన్ ఆటగాడు మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ గోల్‌తో స్పెయిన్ విజయాన్ని ఖాయం చేసుకోగా.. పోర్చుగల్ ఆటగాళ్లు నిరాశతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. తన కెరీర్లో చివరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతున్నాననే భావనతో కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డోకు ఇది ఒక యుగానికి ముగింపుగా మారింది.
రొనాల్డో ప్రపంచకప్ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో నిండిపోయింది. పోర్చుగల్ తరఫున ఎన్నో కీలక మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనలు చేసిన ఆయన, జట్టుకు నాయకుడిగా ఎన్నో విజయాలు అందించాడు. ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం ఆయనకు అందని కలగానే మిగిలిపోయింది. అయినప్పటికీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఆయన సాధించిన ఘనతలు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తాయి.
ఇదిలా ఉంటే స్పెయిన్ ఈ మ్యాచ్‌లో మరో చారిత్రక ఘనత సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌లలో ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఇటలీ, స్విట్జర్లాండ్ పేరిట ఉన్న వరుస క్లీన్ షీట్ రికార్డును స్పెయిన్ అధిగమించింది.
స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సిమోన్ కూడా ఈ మ్యాచ్‌తో అరుదైన రికార్డు సాధించాడు. వరుసగా 609 నిమిషాల పాటు ప్రపంచకప్ మ్యాచ్‌లలో గోల్ ఇవ్వకుండా నిలిచాడు. గతంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా పేరిట ఉన్న 517 నిమిషాల రికార్డును అధిగమించాడు.
స్పెయిన్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది. జట్టు ప్రదర్శన చూస్తే ఈ టోర్నీలో స్పెయిన్ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బలమైన రక్షణ, సమర్థవంతమైన మిడ్‌ఫీల్డ్, దూకుడైన ఆటతీరుతో స్పెయిన్ ప్రత్యర్థులకు సవాల్‌గా మారింది.
మరోవైపు రొనాల్డో అభిమానులకు మాత్రం ఈ ప్రపంచకప్ భావోద్వేగ ప్రయాణంగా మిగిలిపోయింది. ఆటలో వేగం, ఫిట్నెస్, గోల్స్ విషయంలో ఎన్నో సంవత్సరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం చివరి ప్రపంచకప్‌ను విజయంతో ముగించలేకపోయినా, ఆయన వారసత్వం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు.
ఫుట్‌బాల్ చరిత్రలో రొనాల్డో పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. పోర్చుగల్ జెర్సీలో ఆయన చేసిన పోరాటం, సాధించిన విజయాలు, అభిమానులతో ఏర్పరచుకున్న అనుబంధం తరతరాలకు గుర్తుండిపోతాయి. 2026 ప్రపంచకప్‌లో ఆయన ప్రయాణం ముగిసినా.. క్రిస్టియానో రొనాల్డో అనే పేరు మాత్రం ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news