పశ్చిమ బెంగాల్లోని బరుయిపూర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ సయోని ఘోష్ తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. ఆమె అక్కడికి చేరుకున్న వెంటనే స్థానికులలో కొందరు "గద్దార్", "బేమాన్" అంటూ నినాదాలు చేశారు. "నిన్ను ఎంతకు కొనుగోలు చేశారు?" అంటూ కూడా ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సయోని ఘోష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్కడికి చేరుకోగా, మొదట పోలీసులు వారిని ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత వారిని కుటుంబాన్ని కలిసేందుకు అనుమతించారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిరసనల మధ్య కూడా సయోని ఘోష్ బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధితురాలు తన సొంత కుమార్తె అయితే ఎలా బాధపడేదో అలాంటి భావన కలిగిందని అన్నారు. నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆమె మాట్లాడుతూ, ప్రజలందరూ నిందితులకు గరిష్ఠ శిక్ష కోరుతున్నారని, అయితే ముఖ్యమైన విషయం న్యాయం ఎంత వేగంగా జరుగుతుందనేదేనని పేర్కొన్నారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆమె కోరారు
Fetching videos...
Fetching latest news...
No trending news