మూడు దశాబ్దాలుగా కరువు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే జాతికి అంకితం చేయడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం చంద్రబాబు నాయుడు చూపుతున్న ప్రత్యేక చొరవకు వెలిగొండ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కృష్ణా వరద జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి వివరించారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు తాగునీటి భరోసా కూడా వెలిగొండ ద్వారా కలుగుతుందని తెలిపారు. కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సాగునీరు అందుబాటులోకి రావడంతో చెరువులు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వెలిగొండ ప్రాజెక్టు కొత్త ఆశలను కల్పిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభించడంతో కరువు ప్రాంతాల నుంచి జరిగే వలసలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని చెప్పారు. కేవలం 48 రోజుల్లోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.762 కోట్ల పరిహారం అందించడం సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టును పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రారంభోత్సవం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలను నిజం చేసే దిశగా వెలిగొండ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో కరువు ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. వెలిగొండ ద్వారా పలు జిల్లాల్లోని రైతులు, ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news