మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం రైతులు, నిర్వాసితుల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, నిర్వాసితులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు, నిర్వాసితులకు గౌరవం కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాసితులతో జ్యోతి ప్రజ్వలన చేయించి ముఖ్యమంత్రి సభను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుకోబోతున్న రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా ప్రముఖులు వేదికపై ప్రత్యేక స్థానాల్లో కూర్చోవడం ఆనవాయితీ కాగా, చంద్రబాబు తనకు ఇరువైపులా రైతులను కూర్చోబెట్టుకుని వారిని గౌరవించారు. రైతులే ఈ ప్రాజెక్టు ప్రధాన లబ్ధిదారులని చాటిచెప్పేలా ముఖ్యమంత్రి వ్యవహరించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావడంతో మార్కాపురం ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కృష్ణా జలాలు కరువు ప్రాంతాలకు చేరడంతో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ద్వారా సాగునీటి లభ్యత పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి లభించే అవకాశం ఉంది. అలాగే ప్రాంతంలోని తాగునీటి సమస్యలకు కూడా పరిష్కారం లభించనుంది.
వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి మార్కాపురం జిల్లాకు నీరందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పాదాభివందనం చేసి తన అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతానికి వెలిగొండ నీటిని తీసుకురావడం గొప్ప విజయమని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రారంభోత్సవంలో రైతులు, నిర్వాసితులకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లను కోల్పోయిన నిర్వాసితులను కూడా కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా వారి త్యాగాలను గుర్తించినట్లు అయింది. రైతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయించడం, వేదికపై వారికి గౌరవ స్థానం కల్పించడం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు ప్రయోజనం చివరికి రైతులకే చేరాలన్న సందేశాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news