కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత నియామక వ్యవస్థలు ఉద్యోగ నియామకాల్లో వేగాన్ని పెంచుతున్నప్పటికీ, అవి మహిళల కెరీర్‌పై, ముఖ్యంగా మధ్యవయసు మహిళల ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న అనేక మంది మహిళలు, తమ అనుభవం ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వయస్సు, లింగం ఆధారంగా పరోక్ష వివక్ష చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లండన్‌కు చెందిన 52 ఏళ్ల స్టేసీ డుగ్విడ్ ఈ చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు. ఫ్యాషన్ రంగంలో దశాబ్దాలపాటు సీనియర్ కార్పొరేట్ హోదాల్లో పనిచేసిన ఆమె, ఫ్రీలాన్స్ కెరీర్ అనంతరం మరోసారి పూర్తి స్థాయి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఉద్యోగం పొందడంలో ఇబ్బంది పడని ఆమెకు ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది.
దాదాపు 16 నెలల పాటు ఆమె అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. తన మాటల్లో చెప్పాలంటే "లెక్కలేనన్ని సీవీలు" పంపినా, ఎక్కువ సందర్భాల్లో ఆటోమేటిక్ ఇమెయిల్ సమాధానాలు తప్ప ఎలాంటి స్పందన రాలేదు. ఇంటర్వ్యూలకు కూడా చాలా తక్కువ అవకాశాలు లభించాయి. దీంతో సమస్య తనలోనే ఉందా అనే సందేహం ఆమెను వేధించడం ప్రారంభించింది.
ఈ అనుభవాన్ని స్టేసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తనలాంటి వయస్సు ఉన్న మహిళలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించగా, వేలాది మంది మహిళల నుంచి స్పందనలు వచ్చాయి. తమకు కూడా ఇదే తరహా అనుభవాలు ఎదురవుతున్నాయని వారు వెల్లడించారు. దీంతో ఈ సమస్య వ్యక్తిగతం మాత్రమే కాదని, విస్తృత స్థాయిలో ఉందనే చర్చ మొదలైంది.
స్టేసీ అభిప్రాయం ప్రకారం, ఏఐ ఆధారిత నియామక వ్యవస్థలు ఈ పరిస్థితికి ఒక కారణం కావచ్చు. అందుకే ఆమె తన బయోడేటాను "బోటాక్స్" చేశానని సరదాగా వ్యాఖ్యానించారు. అంటే, తన వయస్సు, సుదీర్ఘ అనుభవాన్ని నేరుగా తెలియజేసే వివరాలను సీవీ నుంచి తొలగించానని చెప్పారు. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను మాత్రమే ఉంచి, వయస్సును అంచనా వేసే అంశాలను తగ్గించేందుకు ప్రయత్నించానని వివరించారు.
ఆమె మాట్లాడుతూ, "ఏఐ సమాజంలో ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే అద్దంలాంటిది" అని వ్యాఖ్యానించారు. సమస్య ఏఐలో మాత్రమే లేదని, సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను ఏఐ నేర్చుకుని తిరిగి అదే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం మహిళల సమస్య మాత్రమే కాదని, పురుషుల నుంచి కూడా ఇలాంటి సందేశాలు వచ్చాయని ఆమె తెలిపారు. అయితే ముఖ్యంగా వయస్సు, లింగం కలిసినప్పుడు ఏర్పడే "జెండర్డ్ ఏజిజం" మరింత తీవ్రమైన సమస్యగా మారుతోందని చెప్పారు.
ప్రస్తుతం అనేక కంపెనీలు ఉద్యోగ దరఖాస్తులను పరిశీలించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. వందలాది లేదా వేలాది దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ వ్యవస్థలు గత నియామకాల డేటాను ఆధారంగా చేసుకుని పనిచేస్తే, అందులో ఇప్పటికే ఉన్న పక్షపాతాలు కొత్త అభ్యర్థుల ఎంపికలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news