నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శ్రీ నారాయణ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినికి గాయం కావడానికి కారణమైన పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాలలో దాడి జరిగిందని, ఈ ఘటనలో ఆమె చేయికి గాయం అయిందని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు స్పందించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పాఠశాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్, జిల్లా కోశాధికారి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య అందించాల్సిన ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. విద్యార్థులపై ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.
పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, ఇతర వస్తువుల విక్రయాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల హక్కులను రక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థినికి జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరసన కార్యక్రమం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల విద్యాశాఖ అధికారిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారి సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. దీంతో తాత్కాలికంగా నిరసన కార్యక్రమాన్ని విరమించినట్లు వెల్లడించారు.
విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్తామని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కుల్లాయి, అస్లాం, అక్రమ్, హరి, ధనుష్, వెంకీ, మనోహర్, జస్వంత్, సుశీల్, మధు, ఖదీర్ భాష, శివ, గౌరీ ఉదయ్, కిరణ్, హమీద్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news