ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రత్యేక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందింది.
జైపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నిర్వాహకుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ పురస్కారం నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని పర్యాటక అవకాశాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సాంస్కృతిక వైభవం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఎంతో అనుకూలంగా ఉన్నాయని మంత్రి వివరించారు. అందమైన ప్రాంతాలు, మెరుగైన ఆతిథ్య సౌకర్యాలు, ప్రత్యేక అనుభవాలను అందించే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో జరిగే వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ను ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏపీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేలా చర్యలు తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న వరుస విజయాలను మంత్రి ప్రస్తావించారు. ఇటీవల కేరళలో నిర్వహించిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ కార్యక్రమంలో బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు అందుకున్నామని, అలాగే గోవాలో ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో అరకు ప్రాంతానికి మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్‌స్కేప్ అవార్డు లభించిందని తెలిపారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు రావడం రాష్ట్ర పర్యాటక రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్లో లభించిన ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ పురస్కారం రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల ప్రాచుర్యాన్ని పెంచడంతో పాటు వివాహ వేడుకల నిర్వహణకు కొత్త అవకాశాలను సృష్టించనుంది.
ఈ సందర్భంగా అవార్డు అందించిన నిర్వాహకులకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news