అమరావతి: నేపాల్‌లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ వరదల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రజలు, యాత్రికులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. విపత్తులో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బాధితుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూంను సంప్రదించి తమవారి వివరాలను తెలియజేయవచ్చు.
ఏపీ భవన్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 011-23384016, 011-23387089 అందుబాటులో ఉంచారు. అలాగే వాట్సాప్ ద్వారా సమాచారం అందించేందుకు 9059824101 నంబర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలు, ప్రస్తుత పరిస్థితి, అవసరమైన సహాయం వంటి సమాచారాన్ని ఈ నంబర్ల ద్వారా అధికారులకు తెలియజేయవచ్చు.
బాధితులను గుర్తించిన వెంటనే వారికి అవసరమైన సహాయం అందించి, పరిస్థితులకు అనుగుణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, నేపాల్‌లోని పరిస్థితులపై తాజా సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
ఆర్టీజీ నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, నేపాల్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. విపత్తు పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సహాయం అందేలా వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని సీఎం స్పష్టం చేశారు.
నేపాల్‌కు వెళ్లిన ఏపీ వాసుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా, తమవారి వివరాలను కంట్రోల్ రూంకు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. బాధితుల ఆచూకీ, భద్రతపై సమాచారం సేకరించి, అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పరిస్థితిని పర్యవేక్షించనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news