అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యల అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా మంత్రివర్గానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వెంటనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ ద్వారా అభ్యంతరకర పోస్టులను గుర్తించడం, వాటిపై విచారణ చేపట్టడం, అవసరమైన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు కూడా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి వ్యూహాల్లో పడకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. రాజకీయ విమర్శలకు స్పందించే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టపరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్లాలని నేతలకు సూచించినట్లు సమాచారం.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, అభ్యంతరకర వ్యాఖ్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news