జీతాల పెంపు విషయంలో హైర్ బస్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు మరోసారి ఆందోళనకు దిగారు. చీరాల, బాపట్ల, రేపల్లె డిపోల పరిధిలో హైర్ బస్సులను నిలిపివేసి మెరుపు బంద్ నిర్వహించారు. రెండు రోజుల క్రితం జీతాలు పెంచుతామని యజమానులు హామీ ఇవ్వడంతో విధులకు హాజరైన డ్రైవర్లు, ఇప్పటికీ ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ నిరసన చేపట్టారు. రేపల్లె డిపోలో పనిచేస్తున్న సుమారు 30 మంది డ్రైవర్లు విధులను బహిష్కరించి డిపో ఎదుట నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి, మదర్ థెరిస్సా హైర్ బస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సీహెచ్. మణిలాల్, డిపో అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా డ్రైవర్ల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హైర్ బస్ డ్రైవర్లకు రోజుకు రూ.1,100 నుంచి రూ.1,200 మాత్రమే చెల్లిస్తున్నారని, అదే విధులు నిర్వహిస్తున్న ఇతర డ్రైవర్లకు ఎక్కువ వేతనం లభిస్తోందని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న వేతనానికి అదనంగా కనీసం రూ.500 పెంచి రోజువారీ డ్యూటీకి రూ.1,700 చెల్లించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రత, భవిష్య నిధి, ఉద్యోగుల బీమా, బోనస్, యూనిఫాం వంటి చట్టబద్ధమైన హక్కులు కూడా తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
యజమానులు తక్షణమే చర్చలకు వచ్చి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో హైర్ బస్ డ్రైవర్లు, యూనియన్ నాయకులు, సీఐటీయూ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం, యజమానులు సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news