నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి వసతులతో తీర్చిదిద్దుతూ నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో దానిని పునరుద్ధరించాలనే సంకల్పంతో నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టి సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య నిరంతర అనుసంధానం ఉండాలనే లక్ష్యంతో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కుటుంబం, పాఠశాల, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్, బలమైన సంకల్పం, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. పాఠశాలల్లో చిన్నారులను చూడగానే ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం కలుగుతుందని పేర్కొంటూ, వారే రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువులో రాణించి కుటుంబానికి, పాఠశాలకు, గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
బనగానపల్లె నియోజకవర్గంలో ‘తల్లికి వందనం’ పథకం ద్వారా 43,987 మంది విద్యార్థులకు సంబంధించిన 27,953 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.57.18 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లకు పైగా జమ చేసి 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చామని చెప్పారు. అనాథ పిల్లలు, అంగన్వాడీ కార్యకర్తల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం సామాజిక బాధ్యతను చాటిందన్నారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 లక్షల మందికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశామని మంత్రి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో పాటు, సన్న బియ్యంతో పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యా ప్రమాణాలతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కూడా సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ ద్వారా ఢిల్లీలో నిర్వహించిన సైన్స్ ఎక్స్పోజర్ కార్యక్రమానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 52 మంది విద్యార్థులను తొలిసారిగా విమానంలో తీసుకెళ్లి శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. బనగానపల్లెతో పాటు అన్ని జిల్లాల్లో స్పేస్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించామని, అమరావతిలో మాక్ అసెంబ్లీ ద్వారా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నాయకత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో నిలిచిపోయిన పాఠశాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు స్మార్ట్ బోర్డులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి వసతులను కల్పిస్తున్నామని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యంగా కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యా విధానాన్ని రూపుదిద్దుతున్నామని మంత్రి చెప్పారు. నైతిక విలువలు, మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించే అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చామని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తూ నైతిక విలువల బోధన, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం ఉపాధ్యాయుల బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహిస్తూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరిగి “నో వేకెన్సీ” బోర్డులు కనిపించే స్థాయికి చేరుకోవడం విద్యా సంస్కరణల విజయానికి నిదర్శనమని అన్నారు.
చివరిగా తల్లిదండ్రులు పాఠశాలలతో నిరంతర సంబంధం కొనసాగించాలని, విద్యార్థులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ అదే లక్ష్యంతో నిర్వహిస్తున్న కీలక కార్యక్రమమని మంత్రి బీసీ జనార్దన్ స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news