మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు కాంట్రాక్ట్ బస్తీ వాసులు అండర్ డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించారు. బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రామ్ థియేటర్ లేడీస్ గేట్ వద్ద, ప్రగతి కాలేజీ సమీపంలోని భద్రయ్య క్లినిక్ ప్రాంతాల్లో గత మూడేళ్లుగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని బస్తీ వాసులు తెలిపారు.
సెప్టిక్ ట్యాంకులు నిండిపోవడంతో మురుగునీరు బయటకు వస్తోందని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ఈ సమస్యపై గతంలోనే మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో అప్పటి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి సమస్యను స్వయంగా చూపించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఇటీవల కూడా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయితే వార్డు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని అధికారులు పేర్కొన్నారని చెప్పారు. దీంతో కాంట్రాక్ట్ బస్తీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించారు.
ప్రజావాణిలో గ్రీన్ మర్చెంట్ అసోసియేషన్ నాయకుడు శ్రీ కమల్ సోమాని, గంగిశెట్టి శ్యామ్, కొత్తపల్లి శ్రీధర్, భద్రయ్య, గర్రెపల్లి రాజు, వెంకటేష్, వి. మహేష్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొని వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్ బస్తీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు కోసం వెంటనే నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ బస్తీలో వ్యాపారి సంపత్ సోమాని తన సొంత ఖర్చుతో సుమారు రూ.35 వేల వ్యయంతో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేయించిన విషయాన్ని కూడా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు అధికంగా చెల్లిస్తున్నప్పటికీ అభివృద్ధి పనులు జరగడం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు సమావేశంలో కాంట్రాక్ట్ బస్తీ అభివృద్ధిపై దృష్టి సారించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, నూతన కాలువ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని బస్తీ ప్రజలు కోరుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news