భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన పారిశుధ్యం, ప్రజా అవసరాలు, ఇతర కీలక ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగించింది.
మున్సిపల్ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వీరు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమన్వయం చేయనున్నారు.
ప్రధాని పర్యటన సందర్భంగా భారీ స్థాయిలో ప్రజలు, ప్రముఖులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పారిశుధ్యం, రవాణా, మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
ఈ నలుగురు ఐఏఎస్ అధికారులకు సహాయంగా వివిధ కార్పొరేషన్ల నుంచి 26 మంది నాన్ క్యాడర్ అధికారులను కేటాయించారు. ఏర్పాట్లలో వీరు కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతి, సమన్వయ అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు.
నియమితులైన అధికారులు విజయనగరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధాని పర్యటన, విమానాశ్రయ ప్రారంభోత్సవం రాష్ట్రానికి కీలక కార్యక్రమం కావడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news