ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారికి ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది.
గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ వేముల శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా అలాంటి కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని బలోపేతం చేయడం, విద్యా ప్రమాణాలపై ప్రజల్లో నమ్మకం పెంచడం కోసం గ్రామస్తుల సహకారంతో ఈ తీర్మానం చేసినట్లు సర్పంచ్ వివరించారు. గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.
గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని చెప్పారు. పన్ను మినహాయింపు ప్రకటన తర్వాత ఇప్పటికే 12 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని, మరికొంత మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కొత్త దిశ చూపించడమే కాకుండా, ఇతర గ్రామ పంచాయతీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు బొమ్మకల్ గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news