విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని జీవీఆర్ నగర్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. రూ.4 కోట్ల 47 లక్షల వ్యయంతో నిర్మించిన 1500 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్ఈఎస్ఆర్ నూతన వాటర్ ట్యాంక్‌ను ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో జీవీఆర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో గద్దె వెంకట్రావు నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం హయాంలో రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశామని తెలిపారు.
ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవడంతో ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.150 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ వాటర్ ట్యాంక్‌కు మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే విమర్శించారు. 2024లో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు, ఇంజినీర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి ట్యాంక్‌కు కనెక్షన్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
జీవీఆర్ నగర్, దావు బుచ్చయ్య కాలనీ, వినాయక్ నగర్, గుండుదల తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మున్సిపల్ మంచినీటి కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కుటుంబానికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వివరాలను సేకరించి సహకరిస్తారని పేర్కొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపేందుకు రూ.85 కోట్ల వ్యయంతో రా వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంట్‌ను మంజూరు చేయించామని బొండా ఉమా తెలిపారు. కృష్ణా నది నుంచి ముడి నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి నియోజకవర్గంలోని అన్ని వాటర్ ట్యాంకులకు సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్తులో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని అన్నారు.
గత 24 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.550 కోట్ల విలువైన పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే మూడేళ్లలో సమస్యలు లేని ఆదర్శ నియోజకవర్గంగా సెంట్రల్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. అధికారం తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్కం రాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి భద్రం, ఇంచార్జ్ కర్ణం వెంకటరమణ, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, ఈఈ గోపాల కృష్ణమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తాగునీటి సౌకర్యం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news