విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కండ్రిక–పాతపాడు రహదారి వంతెన సమీపంలో నిర్మించనున్న మస్జిద్-ఎ-ఇలియాస్ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిర్మాణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమంలో మాట్లాడిన బొండా ఉమామహేశ్వరరావు, మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సమాజంలో మంచి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. అలాంటి సంస్థ తమ నియోజకవర్గంలో మస్జిద్ నిర్మాణం చేపట్టడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది సభ్యులకు, జిల్లాలోని వేలాది మంది భక్తులకు ఉపయోగపడేలా ఈ ప్రార్థనా మందిరం నిర్మాణం జరగడం శుభపరిణామమని అన్నారు.
మస్జిద్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు రహదారి, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మస్జిద్ పూర్తయిన తర్వాత ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఇది ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. మైనారిటీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
గతంలో కూడా ముస్లిం ప్రార్థనా మందిరాల అభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తు చేసిన బొండా ఉమామహేశ్వరరావు, మైనారిటీల అవసరాలను గుర్తించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ప్రార్థనా స్థలాలు, ఇతర సామాజిక అవసరాల కోసం చేపట్టిన కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారులు, వివిధ సంస్థల చైర్మన్లు, మైనారిటీ నాయకులు, మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా ఈ మస్జిద్ నిలవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతంలోని ముస్లిం సోదరులకు మరింత సౌకర్యవంతమైన ప్రార్థనా కేంద్రం అందుబాటులోకి రానుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news