అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జంతు సంక్షేమం పేరుతో నడుస్తున్న ఒక “చంపని” జంతు రక్షణ కేంద్రం వద్ద 117 కుక్కల మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. హంబోల్ట్ కౌంటీలోని ఫార్చునా సమీపంలో ఉన్న మిరాండాస్ రెస్క్యూ ప్రాంగణంలో అధికారులు జరిపిన తవ్వకాల్లో ఈ మృతదేహాలు లభించాయి. వీటిలో అనేక కుక్కల శరీరాల్లో బుల్లెట్ ముక్కలు కనిపించాయని, తుపాకీ గాయాల ఆనవాళ్లు ఉన్నాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం తాను కుక్కలను చంపకుండా రక్షించే ఆశ్రయంగా ప్రచారం చేసుకోవడంతో, ఈ ఘటన జంతు ప్రేమికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. భూగర్భ రాడార్ సహాయంతో ప్రాంగణంలో రెండు సామూహిక సమాధులను అధికారులు గుర్తించారు. పూర్తిగా గుర్తించగలిగిన 117 కుక్కల మృతదేహాలతో పాటు 21 కుక్కల పుర్రెలు, వందలాది ఎముకలు, ఆరు విడి మైక్రోచిప్‌లు, 600కుపైగా కుక్కల కాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మృతదేహాలపై చేసిన ఎక్స్‌రే పరీక్షల్లో బుల్లెట్ ముక్కలు ఉన్నట్లు బయటపడటంతో, ఈ మరణాలు సహజమైనవి కావన్న అనుమానాలు మరింత బలపడ్డాయి
ఈ కేసు ఇప్పుడు జంతు క్రూరత్వం, మోసం, రికార్డుల తారుమారు ఆరోపణల దిశగా పెద్ద దర్యాప్తుగా మారింది. మిరాండాస్ రెస్క్యూ ఇతర జంతు ఆశ్రయాల నుంచి కుక్కలను స్వీకరించి, వాటిని సంరక్షిస్తామని చెప్పినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ దర్యాప్తు పత్రాల ప్రకారం, 2025 జనవరి నుంచి 2026 వసంతకాలం వరకు ఈ కేంద్రానికి పంపిన 900కుపైగా జంతువుల్లో వందలాది జంతువుల ఆచూకీ ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కొన్ని కుక్కలు దత్తతకు వెళ్లినట్లు రికార్డుల్లో చూపించి, వాస్తవానికి అవి మరణించి ఉండొచ్చన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు.మరో కీలక అంశం ఏమిటంటే, ఈ కేంద్రంపై అనుమానాలు ఒక్కసారిగా రావడం కాదు. గతంలో జరిగిన తనిఖీల్లో కూడా మృత కుక్కలు బయటపడినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. తాజా తవ్వకాలు మాత్రం కేసును మరింత తీవ్ర దశకు తీసుకెళ్లాయి. ఫెడరల్ అధికారులు, కాలిఫోర్నియా న్యాయశాఖ, స్థానిక షెరీఫ్ కార్యాలయం, ఫోరెన్సిక్ పశువైద్య నిపుణులు కలిసి సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. మైక్రోచిప్‌ల ద్వారా మృత కుక్కల అసలు వివరాలు, వాటిని ఏ ఆశ్రయం నుంచి పంపారో, యజమానులు ఎవరో గుర్తించే ప్రయత్నం కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news