కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత నితిన్ నబీన్ కొత్త టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిన్న ఆయన పలువురు కేంద్ర సహాయ మంత్రులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు, రేపు కూడా మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ అధిష్ఠానం సమగ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ తరహాలో జాతీయ స్థాయిలో కూడా యువతకు, కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతం చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రత్యేకంగా ఓబీసీ, దళిత వర్గాలు, మహిళలు, యువతకు కొత్త కేబినెట్లో పెద్దపీట వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాల PDA వ్యూహానికి చెక్ పెట్టేలా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కొంతమంది ప్రస్తుత కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి, వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. పనితీరు, అనుభవం, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను ఆధారంగా చేసుకుని కొత్త జట్టు రూపుదిద్దుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా కేంద్ర మంత్రివర్గ మార్పులపై ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో నితిన్ నబీన్ నిర్వహిస్తున్న వరుస భేటీలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త టీమ్ రూపకల్పనపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news