అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 28వసారి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. బటన్ నొక్కి పంపిణీ చేయవచ్చని, అయితే ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన దృష్టిలో సీఎం అంటే సామాన్యుడేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయడమే తన బాధ్యతగా చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా నాలుగుసార్లు ప్రజల వద్దకు వస్తున్నామని, భూసమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలు 54 శాతం ఓట్లు, 94 శాతం సీట్లు ఇచ్చి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్షం లేకుండా పోయిందని, తనపై కోపంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని, ప్రతిపక్షానికి తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం విధ్వంసమైందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ప్రజలు ఓటుతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటివరకు పింఛన్ల రూపంలో రూ.76 వేల కోట్లు ప్రజలకు అందించామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61.92 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయని అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news