ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 24వ తేదీన పోలవరం జిల్లాలోని రంపచోడవరం, ఐ.పోలవరం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మెగా పేరెంట్–టీచర్ మీటింగ్, ప్రజా వేదిక కార్యక్రమం, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం, పార్టీ క్యాడర్ సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు.
జూలై 24న ఉదయం 9.10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాస హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
అనంతరం ఉదయం 10.10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10.20 గంటల నుంచి 11.32 గంటల వరకు నిర్వహించే మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం–4.0) కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటించనున్నారు.
తదుపరి ఉదయం 11.32 గంటలకు పాఠశాల నుంచి బయలుదేరి సమీపంలోని ప్రజా వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 1.17 గంటల వరకు నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, సంబంధిత అంశాలపై అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
ప్రజా వేదిక అనంతరం మధ్యాహ్నం 1.17 గంటలకు తిరిగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1.20 నుంచి 1.45 గంటల వరకు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు రోడ్డు మార్గంలో ఐ.పోలవరం బయలుదేరి టీటీడీ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ క్యాడర్ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు.
సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4.25 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news