చాలా మందికి అకస్మాత్తుగా చాక్లెట్ లేదా స్వీట్స్ తినాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, బోర్ ఫీలింగ్ ఉన్నప్పుడు లేదా మూడ్ డౌన్‌గా ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. చాక్లెట్స్, కేక్స్, బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ వంటి వాటిని ఎక్కువగా తినాలనిపించడం సాధారణమే అయినా, దీని వెనుక శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలో “కోర్టిసాల్” హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావంతో తక్షణ ఎనర్జీ ఇచ్చే ఆహారాలపై ఆకర్షణ పెరుగుతుంది. చాక్లెట్, స్వీట్స్ వంటి వాటిలో ఉన్న షుగర్ తాత్కాలికంగా మూడ్‌ను మెరుగుపరుస్తుంది కాబట్టి మెదడు వాటిని కోరుకుంటుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
చాలా సందర్భాల్లో ఇది “ఎమోషనల్ ఈటింగ్” కారణంగా జరుగుతుంది. ఆకలి లేకపోయినా భావోద్వేగాల కారణంగా తినడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి లేదా టైమ్ పాస్ కోసం ఏదైనా తినడం వంటి అలవాట్లు దీనికి కారణమవుతాయి. రోజూ చాక్లెట్ తినే అలవాటు ఉండటం లేదా ఇతరులు తింటున్నప్పుడు చూడడం కూడా ఈ కోరికను పెంచుతుంది.
నిపుణుల ప్రకారం, ఈ తరహా ఆహారపు అలవాట్లు కొనసాగితే శరీరంలో అదనపు క్యాలరీలు చేరి బరువు పెరగడం, ఫ్యాట్ స్టోరేజ్ పెరగడం జరుగుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఈ అలవాటును తగ్గించుకోవడానికి ముందుగా భావోద్వేగాలను కంట్రోల్ చేయడం అవసరం. ఒత్తిడి ఉన్నప్పుడు వెంటనే తినడం కాకుండా వాకింగ్ చేయడం, మ్యూజిక్ వినడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. ఇవి మనసును రిలాక్స్ చేసి ఎమోషనల్ ఈటింగ్‌ను తగ్గిస్తాయి.
అలాగే ఆహార ఎంపికలో కూడా జాగ్రత్తలు అవసరం. చాక్లెట్ లేదా స్వీట్స్ బదులుగా తాజా పండ్లు, నట్స్, ఫైబర్ రిచ్ కూరగాయలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన ఆప్షన్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇస్తూనే అనవసర క్యాలరీలను తగ్గిస్తాయి.
మొత్తానికి, చాక్లెట్ తినాలనే కోరిక కేవలం ఆకలి వల్ల మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఒత్తిడి, అలవాట్ల వల్ల కూడా వస్తుంది. దీనిని సరిగ్గా అర్థం చేసుకుని నియంత్రించగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Fetching videos...
Fetching latest news...
No trending news