ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేసిన సీఎం, స్పిల్వే వద్ద గోదావరి వరద నీటి ప్రవాహంతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టులోని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 పనులను సీఎం పరిశీలించనున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల పురోగతిని కూడా సమీక్షించి, పనుల నాణ్యత, వేగంపై అధికారులతో చర్చించనున్నారు. ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నట్లు సమాచారం.
ఈ పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వెంట ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రస్తుత పనుల స్థితి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ జాతీయ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news