ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కోనసీమ జిల్లాలోని పిచ్చుకులంక గ్రామాన్ని సందర్శించి కొత్తపేట నియోజకవర్గ రైతులతో సమావేశం కానున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి అవసరాలు, పంటల పరిస్థితి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన నేరుగా రైతులతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం కోనసీమ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.
పోలవరం ప్రాజెక్టులో గతంలో దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేసే భారీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం రూ.152.95 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతుండగా, మొదటి భాగం కింద రూ.130.42 కోట్లు, రెండో భాగం కింద రూ.22.53 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనుల్లో భాగంగా 117 గేట్ల స్థానంలో కొత్త గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు 12 హెడ్ స్లూయిజ్ గేట్ల దిగువ షట్టర్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా 175 క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బరు సీల్స్ అమర్చడం, 734 రోలర్ బేరింగ్స్ను కొత్తవాటితో మార్చడం వంటి కీలక పనులు నిర్వహించనున్నారు.
ఇక 197 గేట్లకు వైర్ రోప్స్ మార్పు, గేట్లకు సౌండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ పనులు కూడా చేపట్టనున్నారు. రెండో భాగం కింద 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడంతో పాటు 175 గేట్లకు అవసరమైన విద్యుత్ కేబుల్స్, వైరింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రత, దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గేట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
పోలవరం పర్యటన సందర్భంగా ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2 పనులు, పవర్ హౌస్ల నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి పనుల వేగం, నాణ్యత, గడువులోగా పూర్తి చేసే అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రానికి పూర్తిస్థాయి సాగునీరు, తాగునీరు, విద్యుత్ ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టగా, రాష్ట్రంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news