మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రికి చేరుకున్నారు. ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీని సందర్శించిన సీఎం చంద్రబాబు, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. గోదావరి నీటి ప్రవాహం, బ్యారేజీ నిర్వహణ, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యారేజీ భద్రత, సామర్థ్యం పెంపునకు చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
పాత గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా, ఆధునిక ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
ధవళేశ్వరం బ్యారేజీ రాష్ట్ర సాగునీటి వ్యవస్థలో అత్యంత కీలకమైనదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి డెల్టా ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో బ్యారేజీ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బ్యారేజీ సామర్థ్యం, భద్రత పెంచడం ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ పర్యటనలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా సాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news