అమరావతిలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలు, జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ నెల 20న ఉండవల్లి గుహల సమీపంలో నిర్వహించే ప్రత్యేక యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర స్థాయి యోగా వేడుకల్లో బాబా రాందేవ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచే ఉద్యమంగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు.
యోగాను ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో సంజీవని కార్యక్రమంతో యోగాంధ్రను అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ, ప్రజలందరూ యోగా సాధనపై ఆసక్తి కనబరిచేలా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే వారికి తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా, భద్రత తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్రను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసి, యోగాను ఇంటింటికీ తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news