వింబుల్డన్ 2026లో నిరాశాజనకంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించింది. సెమీఫైనల్లో కరోలినా ముచోవాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి పాలైన గాఫ్, మ్యాచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో వచ్చే ద్వేషపూరిత సందేశాల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఓడిన ప్రతిసారీ కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా దూషించడం, అవమానించడం అలవాటుగా మార్చుకున్నారని, కానీ ఆ వ్యాఖ్యలను తాను ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేసింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ గాఫ్, "ఓడిన వెంటనే సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా బెట్టింగ్‌లో డబ్బు కోల్పోయిన కొందరు తీవ్ర స్థాయిలో దూషిస్తుంటారు. అలాంటి కామెంట్లు బాధ కలిగిస్తాయి. అయితే వాటిని నేను ప్రేరణగా మార్చుకుంటాను" అని తెలిపింది. తాను మళ్లీ పెద్ద టైటిల్ గెలిచిన రోజు, ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారిని గుర్తు చేసుకుని సమాధానం ఇస్తానని చెప్పింది. "నేను విజయం సాధించినప్పుడు వారినే ట్యాగ్ చేస్తాను" అంటూ గాఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వింబుల్డన్‌లో గాఫ్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినా, సెమీఫైనల్లో మ్యాచ్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఆమెకు చేదు అనుభవంగా మారింది. కీలక సమయంలో తీసుకున్న నిర్ణయం ఫలించకపోవడంతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఈ ఓటమిపై తనకు పెద్దగా పశ్చాత్తాపం లేదని, టెన్నిస్‌లో ఇలాంటి క్షణాలు సహజమని గాఫ్ పేర్కొంది. మ్యాచ్‌లో కొన్ని పాయింట్లు కేవలం చిన్న తేడాతోనే నిర్ణయించబడతాయని, వాటిని అంగీకరించి ముందుకు సాగాల్సిందేనని చెప్పింది
ఇటీవలి కాలంలో టెన్నిస్ క్రీడాకారులు సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై కూడా గాఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెట్టింగ్ కారణంగా ఆటగాళ్లపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయని, ఇది క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. అయితే అలాంటి విమర్శలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవని, మరింత కష్టపడి తిరిగి విజయాలు సాధించేందుకు అవే తనకు ప్రేరణగా నిలుస్తాయని స్పష్టం చేసింది.
ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ వంటి గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను ఇప్పటికే గెలిచిన గాఫ్, ఇప్పుడు తన దృష్టిని రాబోయే టోర్నీలపై కేంద్రీకరించింది. వింబుల్డన్‌లో ఎదురైన ఈ నిరాశను మరచిపోయి, అమెరికా హార్డ్కోర్ట్ సీజన్లో మరింత బలంగా పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తనపై విమర్శలు చేసిన వారికి ఆటతోనే సమాధానం చెబుతానని గాఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు కూడా ఆమె త్వరలోనే మరో టైటిల్ గెలిచి ఘనంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news