బరువు తగ్గాలనుకునేవారు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు ఎక్కువగా ఎంచుకునే ఆహారాల్లో కీరదోసకాయ ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలిగి, తరచూ ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో క్యాలరీల వినియోగం తగ్గి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే, కీరదోసకాయ ఎంత ఆరోగ్యకరమైనదైనా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరి శరీర తత్వానికి ఇది సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణకోశం ఉన్నవారిలో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు కీరదోసకాయలో చేదు రుచి వస్తుంది. దీనికి కారణం అందులో ఉండే “కుకుర్బిటాసిన్స్” అనే సహజ రసాయనాలు. స్వల్ప మోతాదులో ఇవి హానికరం కాకపోయినా, మరీ చేదుగా ఉన్న కీరదోసకాయను తింటే వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి కీరదోసను వెంటనే వాడకూడదు.
అలాగే కీరదోసకాయపై హానికర బ్యాక్టీరియా చేరే అవకాశం కూడా ఉంటుంది. సరిగా కడగకుండా తినడం లేదా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు.
కొంతమందిలో కీరదోసకాయ అలర్జీ కూడా కనిపించవచ్చు. నోరు, గొంతులో దురద, పెదవులు లేదా నాలుక వాపు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వెంటనే దానిని ఆపేసి వైద్యుడిని సంప్రదించడం అవసరం.
కీరదోసకాయలో దాదాపు 95% నీరు ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తింటే తరచుగా మూత్ర విసర్జన అవసరం పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి.
నిపుణుల సూచన ప్రకారం కీరదోసకాయను తినే ముందు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు తొక్క తీసి తింటే మంచిది. రోజుకు ఒకటి లేదా అర ముక్క మాత్రమే సలాడ్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి సరైన మోతాదుగా భావించబడుతుంది.
మొత్తానికి, కీరదోసకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా మితంగా మరియు సరైన విధంగా తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే లాభాల కంటే సమస్యలే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news