దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. 5వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
పెద్దమ్మ దేవాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు తెలియజేశారు.
రెండేళ్ల పాలనలో ఇంటింటికీ వెళ్తున్న సమయంలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మొదటి సంతకాలతోనే అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత అని పేర్కొన్నారు.
పింఛన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి వంటి పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు.
5వ డివిజన్లో రెండేళ్లలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు.
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన 184వ బూత్ ఇన్చార్జి గీతాంజలిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news