శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా యూట్యూబ్, ఆన్లైన్ వేదికల్లో ప్రచారం చేస్తున్న అసత్య వీడియోలపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ధర్మాసనం, వీడియోలను తొలగించాలంటూ శిర్డీ సాయిబాబా ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తూ, శిర్డీ సాయిబాబా ట్రస్ట్ పిటిషన్ను గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ పరిశీలించాలని సూచించింది. పిటిషన్ ప్రాధాన్యతను గుర్తించి వారం రోజుల్లోగా సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తన ఆదేశాల అమలు తీరుపై నివేదికను తదుపరి విచారణకు ముందు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 19న జరగనుంది. అప్పటిలోగా తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
సమాచార సాంకేతిక చట్ట నిబంధనల ప్రకారం యూట్యూబ్, గూగుల్ వంటి ఆన్లైన్ వేదికలకు ఫిర్యాదు చేసినప్పటికీ వివాదాస్పద వీడియోల తొలగింపునకు తగిన చర్యలు తీసుకోలేదని శిర్డీ సాయిబాబా ట్రస్ట్ ఆరోపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులను కూడా ఆశ్రయించినట్లు తెలిపింది.
శిర్డీ సాయిబాబా గురించి అసత్య ఆరోపణలు, దుష్ప్రచారంతో కూడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయని ట్రస్ట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ వీడియోలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు సామాజిక ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అలాంటి విద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలతో కూడిన వీడియోలను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రస్ట్ దిల్లీ హైకోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, గూగుల్, యూట్యూబ్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఆన్లైన్ వేదికల్లో వ్యక్తుల, సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు అవసరమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలగకుండా చట్టపరమైన విధానాల్లోనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
శిర్డీ సాయిబాబాకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న నేపథ్యంలో, ఆయనపై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని ట్రస్ట్ కోరుతోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సంబంధిత కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news