రిజిస్టర్ సేవా కేంద్రాల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని కోరుతూ బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల ప్రాంతాలకు చెందిన డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు బుధవారం బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్, అరుణ భారతి అధ్యక్షులు బీసీ రాజారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో రిజిస్టర్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జారీ చేసిన జీవో ఎంఎస్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు కోరారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రిజిస్టర్ సేవా కేంద్రాల ఏర్పాటుతో ప్రజల ఆస్తుల భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్లు అభిప్రాయపడ్డారు. ఎన్నో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్ల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వారు తమ సమస్యలను బీసీ రాజారెడ్డికి వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రెండు రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని రిజిస్టర్ సేవా కేంద్రాల నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 140 ఏళ్లుగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ఉపాధిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు వేముల రామకృష్ణయ్య, బచ్చు మధుసూదనరావు, మల్లేశ్వరుడు, చలమారెడ్డి, విశ్వనాథరావు, ప్రసాదరావు, నగరూరి ప్రసాద్, స్టాంపు వెండర్లు సుబ్బరాయుడు, రఫీ, సుబ్బారావు, నవీదు, సన్నీ, సందీప్, ప్రవీణ్ కుమార్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news