ఎమ్మిగనూరు వ్యవసాయ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట ఎంపీఓలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్ర ఏపీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంపీఓలు డిమాండ్ చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు, వేతనాలు, భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీఓలకు కనీసం రూ.35 వేల వేతనం అందించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నుంచి ఐదు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాలు ఎదురైతే కుటుంబాలకు ప్రమాద బీమా, ఆరోగ్య సేవల కోసం ఆరోగ్య కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఈ-క్రాప్ నమోదు, పంట నష్టాల వివరాల సేకరణ, రైతు భరోసా, పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను రైతులకు చేరవేయడంలో ఎంపీఓలు కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవలను అందించడంలో నిరంతరం పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు.
ఈ నిరసనకు రాష్ట్ర ఏపీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు బసవరాజు, ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు, సీఐటీయూ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎంపీఓల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news