ఉపాధి హామీ పథకాన్ని హార్టికల్చర్తో అనుసంధానం చేస్తూ రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రెండేళ్లలో రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రూ.500 కోట్ల నిధులతో లక్షా 10 వేల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరేలా హార్టికల్చర్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పండ్ల తోటల సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సాహం లభించనుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన రైతులకు పండ్ల తోటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 46 వేల మంది గిరిజన రైతులు గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందనుంది.
రాయలసీమ ప్రాంతంలో కూడా హార్టికల్చర్ సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే 62 వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి చర్యలు చేపట్టి రైతులను ప్రోత్సహిస్తోంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు ప్రత్యామ్నాయ పంటల ద్వారా ఆదాయం పొందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, హార్టికల్చర్ అనుసంధానంతో రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా భూముల సద్వినియోగం, రైతుల ఆదాయ వృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం వివిధ శాఖలను సమన్వయం చేస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో హార్టికల్చర్ సాగును విస్తరించడం ద్వారా రైతులకు శాశ్వత ఆదాయ మార్గాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news