రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం శ్రీకాకుళంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని 44వ డివిజన్ పరిధిలో ఉన్న ఎంజే పీఏబీసీడబ్ల్యూఆర్ బాలికల పాఠశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ ఇన్చార్జి కవ్వాడి సుశీల పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి విద్యలో రాణించాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కవ్వాడి సుశీల మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని, విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. విద్యార్థుల్లో చిన్న వయస్సులోనే దృష్టిలోపాలను గుర్తించి తగిన చికిత్స అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల్లో దృష్టిలోపాలు గుర్తించిన విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు, కళ్లద్దాల పంపిణీ వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం. సంధ్య, పాఠశాల ప్రిన్సిపాల్ పి. సంధ్య, జిల్లా మేనేజర్ ఎస్. పుష్పలత, వైద్య సిబ్బంది పి. రాజేశ్వరి, కె. దాసు, జి. పద్మజ, టి. తులసి, కె. అరుణ, ఐ. సూర్యకుమారితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వాగతిస్తూ విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news