గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ కార్యక్రమంలో మహిళల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు స్థల వివాదాలు, పెన్షన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సిరిపురపు అనురాధ అనే మహిళ తన రేషన్ కార్డులో కారు ఉన్నట్లు నమోదైందని, దాని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఆ నమోదును తొలగించి న్యాయం చేయాలని కోరారు. మరో మహిళ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేయగా, ఇంకొక మహిళ టిడ్కో ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
శ్రీనివాసరావుపేటకు చెందిన మహిళ జీవనోపాధి కోసం తోపుడు బండి మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఏటి అగ్రహారం ప్రాంతానికి చెందిన మహిళ తమ ఇంటి గోప్యతకు భంగం కలుగుతోందని ఫిర్యాదు చేశారు. పొరుగు ఇంటి యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్ల తమ ఇంటి కార్యకలాపాలు కూడా కనిపిస్తున్నాయని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళలు అందించిన ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల విజయాలకు ప్రతీకగా నిలిచిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌గా భాగస్వామ్యమైన గుంటూరుకు చెందిన కుటుంబరాయుడు వూరుబండిని ఎమ్మెల్యే అభినందించారు. ఆయన సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
అలాగే స్టాంప్ రైటర్ల ప్రతినిధులు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని కలిసి తమ వృత్తికి సంబంధించిన సమస్యలను వివరించారు. జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news