గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖాళీ స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి చర్యలు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖాళీ స్థలాల శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్లుగా అసెంబ్లీ, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఖాళీ స్థలాల సమస్యపై గళమెత్తిన ఎమ్మెల్యే చొరవతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఖాళీ స్థలాల క్లియరెన్స్ పనులను అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని 25వ డివిజన్ సీతారామనగర్ నుంచి ఆదర్శ్‌నగర్ రోడ్డులో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత పనులను ఆమె స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో నిర్లక్ష్యంగా వదిలేసిన ఖాళీ స్థలాలు ప్రజలకు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో ఈ స్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు, విష సర్పాలు, క్రిమికీటకాలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్నాయని అన్నారు.
ఖాళీ స్థలాలు కేవలం పారిశుద్ధ్య సమస్యలకు మాత్రమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు కూడా కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
గత రెండేళ్లుగా అసెంబ్లీలో, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో ఖాళీ స్థలాల సమస్యను ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమస్య తీవ్రతను తెలియజేసేందుకు ఫొటోగ్రాఫిక్ ఆధారాలతో పలుమార్లు వివరించామని చెప్పారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కూడా ప్రత్యేక నివేదిక అందజేసినట్లు వెల్లడించారు.
కార్పొరేషన్ స్థాయిలో కూడా సమస్యను వివరించడంతో జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందించి ఖాళీ స్థలాల శుభ్రతకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. యజమానులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎంసీ ఆధ్వర్యంలో క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 5,500 ఖాళీ స్థలాలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. వీటిలో ఎక్కువ భాగం ప్రైవేట్ యాజమాన్యానికి చెందినవేనని తెలిపారు. భూముల విలువ పెరుగుతుందని భావిస్తూ స్థలాలను శుభ్రం చేయకుండా వదిలేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఒకరోజులో దాదాపు మూడు ఎకరాల భూమిని శుభ్రం చేయడానికి రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే పనిని ప్రైవేట్‌గా చేయిస్తే రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు.
ఖాళీ స్థలాలను శుభ్రం చేసిన అనంతరం యజమానులు వాటిని క్రమం తప్పకుండా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, మళ్లీ చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఖాళీ స్థలాలను నిర్లక్ష్యం చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. అవసరమైతే పోలీసు శాఖ సహకారంతో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ఆదర్శ్‌నగర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కేవలం ఒక డివిజన్‌కే పరిమితం కాదని ఎమ్మెల్యే తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఖాళీ స్థలాలు శుభ్రం అయ్యే వరకు కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం డోజర్లు, క్రేన్లు, ట్రాక్టర్లు, అవసరమైన సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు.
ఒక డివిజన్లో పనులు పూర్తయిన వెంటనే మరో డివిజన్లో శుభ్రత కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఖాళీ స్థలాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news