కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మరియు కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ సంయుక్తంగా ప్రారంభించారు. గ్రామం నుంచి పీఏసీఎస్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ర్యాలీగా చేరుకుని రైతులు, ప్రజల మధ్య కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నూతన భవనాన్ని ప్రారంభించి సహకార రంగ ప్రాధాన్యంపై విస్తృతంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ భవన నిర్మాణానికి స్థలం అందించిన దాత గూడవల్లి మల్లిఖార్జున వరప్రసాద్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలే వెన్నెముక అని అన్నారు. రైతులు, చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడంలో సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం "సహకార్ సే సమృద్ధి" నినాదంతో దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. కంప్యూటరీకరణ, డిజిటలైజేషన్ ద్వారా రుణాల దరఖాస్తు నుంచి మంజూరు, లావాదేవీలు, ఆడిట్ ప్రక్రియల వరకు పారదర్శకంగా నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 425 సహకార సంఘాలు రైతులకు సేవలందిస్తున్నాయని, వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర అవసరాలకు కూడా రుణాలు అందించే దిశగా కేడీసీసీ బ్యాంకు చర్యలు చేపడుతోందని నెట్టెం రఘురామ్ వివరించారు. సహకార సంఘాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ను బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే కోరినట్లు తెలిపారు. ఆ మేరకు బుద్దవరం పీఏసీఎస్ ఆధునీకరణ, కొత్తపల్లి సహకార సంఘం అభివృద్ధి, సూరంపల్లిలో కళ్యాణ మండపం నిర్మాణం, కేసరపల్లి పీఏసీఎస్ పునరుద్ధరణ వంటి పలు కార్యక్రమాలకు సహకారం అందించినందుకు నెట్టెం రఘురామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అనేక సహకార సంఘాలు నిర్లక్ష్యానికి గురై మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా కేసరపల్లి పీఏసీఎస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి తిరిగి గాడిలో పెట్టేందుకు కేడీసీసీ చైర్మన్ సహకరించారని గుర్తుచేశారు. రైతులకు ఉపయోగపడే సంస్థలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
సహకార సంఘాల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ-90ను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఒకే గ్రామంలో దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి కార్యదర్శిగా కొనసాగడం వల్ల అవకతవకలకు అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పీఏసీఎస్ అధ్యక్షులకు పరిపాలనా అనుభవం లేకపోవడం వల్ల కార్యదర్శులే పూర్తి అధికారాలను వినియోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
ఆర్థిక సంస్థల్లో ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేయడం ఆరోగ్యకరమైన పరిపాలనా విధానం కాదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. జీఓ-90 అమలు ద్వారా బదిలీల వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించి అవినీతి అవకాశాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ అంశాన్ని సహకార శాఖ మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అమలు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్ కూడా ఉన్నత స్థాయి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి అమలుకు కృషి చేయాలని కోరారు.
గన్నవరం నియోజకవర్గంలోని సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సంఘాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి కేడీసీసీ బ్యాంకు దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. సహకార రంగం బలోపేతం అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డు ప్రతినిధులు, సహకార సంఘాల చైర్పర్సన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, సహకార సంస్థల అధికారులు, పీఏసీఎస్ పాలకవర్గ సభ్యులు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకార రంగాన్ని మరింత పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధికి సహకార వ్యవస్థ కీలకమని, జీఓ-90 అమలుతో ఈ రంగంలో మరింత సంస్కరణలు సాధ్యమవుతాయని నాయకులు పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news