పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించి సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా గిరిజనులు, ఆదివాసీలు, ఇతర పేదలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. పట్టాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అటవీశాఖ అధికారులు రైతులను భూముల నుంచి బలవంతంగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట, దుమ్ముగూడెం మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో అటవీశాఖ అధికారులు ప్లాంటేషన్ పేరుతో రైతులను ఖాళీ చేయిస్తున్నారని గుమ్మడి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు నిర్వహించి పట్టాలు లేవనే కారణంతో సాగుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, రెండేళ్లు పూర్తవుతున్నా ఆ హామీ అమలుకాలేదని విమర్శించారు. అటవీశాఖ దాడుల నుంచి పోడు సాగుదారులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గతంలో నమోదైన కేసులను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పోడు భూములు సాగు చేస్తున్న అర్హులందరికీ పట్టాలు ఇచ్చి, అటవీశాఖ దాడులను వెంటనే నిలిపివేయాలని గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లాలోని పోడు సాగుదారులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, గిరిజన రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news